Breaking News

Loading..

గిరిజన మ్యూజియానికి ‘ప్రాణ ప్రతిష్ఠ’ అబ్బురపరుస్తున్న ఐటీడీఏ పీవో సతీమణి గీసిన చిత్రం


 
బిసిఎం10 న్యూస్ భద్రాచలం ఆగస్టు 10

కొంతమంది చేతిలో కుంచె అవలీలగా కదిలిపోతూ ఉంటుంది. కలిపే రంగులు కాన్వాస్‌పై సహజత్వాన్ని అద్దుకుంటూ మురిసిపోతాయి. వాటితో మారే ఛాయలు.. కొత్తందాలను చిత్రిస్తాయి. చిత్రాలకు ప్రాణాలు పోస్తాయి. అటువంటిదే ఈ చిత్రం కూడా! పీవో రాహుల్‌ సతీమణి తన స్వహస్తాలతో స్వయంగా కలబోసిన రంగుల ‘కళ’! అదే ట్రైబల్‌ మ్యూజియం ప్రాంగణం చిత్రం. ట్రైబల్‌ మ్యూజియం సృష్టికర్త భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్‌ అయితే.. ఆ మ్యూజియాన్ని తన కళతో ప్రతిసృష్టి చేసి.. ప్రాణ ప్రతిష్ఠ చేశారు.. ఆయన జీవిత భాగస్వామి మనీషా రాహుల్‌. నిత్యం నూతనత్వం కోసం తపించే అధికారి.. పీవో రాహుల్‌. ఆయన తరహాలోనే ఆలోచించే ఆయన జోడీ.. మనీషా!  

బహుళ ప్రజాదరణ పొందుతున్న ట్రైబల్‌ మ్యూజియాన్ని చిరకాలం నిలిచిపోయేలా చిత్రంగా మలచాలని పరితపించారు మనీషా! స్వతహాగా చిత్రకారిణి అయిన మనీషా.. తన కుంచెతో ట్రైబల్‌ మ్యూజియాన్ని ప్రతిసృష్టి చేశారు. తన పెయింటింగ్‌ కళా నైపుణ్యాన్ని ఉపయోగించి.. సహజసిద్ధంగా కనిపించే అద్భుత ‘బహుమతి’గా తయారు చేశారు. మనీషా రాహుల్‌ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కవితలు అల్లడం, కథలు కూర్చడం, శీర్షికలు తీర్చిదిద్దడం ఆమె హాబీ. పండుగ రోజుల్లో మహిళలతో ఆడిపాడుతూ వారిలో ఒకరిలా కలిసిపోతుంటారు. అక్షరాలకు దూరంగా ఉండే గిరిజన పిల్లల్లో చదువుకోవడానికి ముందుకు వచ్చేవారంటే ఆమెకు ప్రీతి. భద్రాచలంలోని చెవిటి, మూగ పాఠశాలలో చదివే చిన్నారులను తరచూ కలుస్తూ, వారి పాఠశాలకు వెళ్లి చిన్నారులతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వారికి తినుబండారాలు, భోజన సౌకర్యం కల్పిస్తూ వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఈ మానవత్వానికి తోడైంది.. ఆమెలోని చిత్రకళా నైపుణ్యం. ఈ మానవతా భావనకు తోడైంది ఆమెలోని చిత్రకళా నైపుణ్యం. ఫలితమే ఈ చక్కటి చిత్రం.

Post a Comment

0 Comments